
జమ్మూకాశ్మీ ర్ కిష్ట్వార్ జిల్లా చషోటి లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించింది. క్లౌబ్ బరస్ట్ కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకోగా.. దాదాపు 200 మంది గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 60కి చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ కూడా సహాయక చర్యల్లో భాగమైంది. ఇప్పటి వరకు 160 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.
శిథిలాల కింద 500 మంది
జల ప్రళయం సమయంలో చషోటి గ్రామంలో వెయ్యి మందికి పైగా ఉన్నారని, సుమారు 500 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ ఘటనలో 60 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. వంద మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. మచైల్ ఆలయానికి వెళ్లే యాత్రికులకు ఈ గ్రామమే బేస్ పాయింట్. ఎగువ ప్రాంతంలో కుండపోత వానల కారణంగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలన్నీ కొట్టుకుపోయాయి. క్లౌడ్ బరస్ట్ సమయంలో బాంబు పేలుడు తరహాలో భారీ శబ్దం వచ్చిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు. పేలుడు రాగానే పరిగెత్తండంటూ అరుపులు వినిపించాయని, రెండు నిమిషాల్లోనే అందరూ 4 అడుగుల బురద, శిథిలాల కింద చిక్కుకుపోయారని క్షతగాత్రులు వెల్లడించారు.
ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ ఫోన్
అటు ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో క్లౌడ్ బరస్ట్ విషాదంపై ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనంత సాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. “ఇప్పుడే ప్రధాని మోడీ నుంచి నాకు కాల్ వచ్చింది. కిస్త్ వార్ లోని పరిస్థితుల గురించి ఆయనకు వివరించి చెప్పాను. అధికారులు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాను. ఆయన మద్దతు, సాయానికి మా ప్రభుత్వం, బాధిత ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు” అని వెల్లడించారు.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!