
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం కారణంగా సుమారు 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్ తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో భూకంపం
ఆఫ్ఘనిస్తాన్ తో పాటు దాని పొరుగున ఉన్న హిమాలయన్ బెల్టులో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఇండియా, యురాసియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకుంటున్న కారణంగా తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయన్ వ్యాలీలలో ఎక్కువ మంది ప్రజలు నివసించటం, సరైన ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించటం, భూకంపాల విషయంలో సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం భూకంపాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుందన్నారు.