క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయనుందని, దీంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాత కార్డులను రద్దు చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే కుటుంబ సభ్యుల పేర్లు చేరుస్తామని చెప్పారు. ఈ నెల 26న ప్రారంభించే కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని హౌసింగ్ మోడల్ కాలనీ పనులను ఆయన పరిశీలించారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా వద్ద ఎత్తిపోతల పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ కార్డుకు అర్హత ఉండి రాని చివరి వ్యక్తి నుంచి కూడా దరఖాస్తు స్వీకరించి, కార్డు అందించేలా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరం నిరంతరం పనిచేస్తున్నామన్నారు.రేషన్ కార్డులు లేనివారు, దరఖాస్తు చేయనివారు, అర్హత ఉన్న ప్రతిఒక్కరూ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నామని, ఈ నెల 26న ఆరంభం మాత్రమేనని, అంతం కాదన్నారు. రేషన్ కార్డులు తొలగిస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 40 వేల కార్డులు మాత్రమేనన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు తర్వాత.. ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తే నాణ్యత లేక ప్రజలు తినలేక కోళ్ల దాణాకు, ఇతర అవసరాలకు వినియోగించారని, కొందరు బ్లాక్ మార్కెట్‌కు తరలించారన్నారు. జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని జవహర్ జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకంగా పేరు మారుస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
1.మీ రాష్ట్రానికి అండగా నరేంద్ర మోడీ ఉన్నారు : అమిత్ షా
2.పర్యాటకులకు కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగరా బోగత జలపాతం..
3.రెండు నెలల్లో లక్షన్నర ఇండ్లు.. కేసీఆర్ కట్టిన 2BHKలే ఇందిరమ్మ ఇండ్లు!