
పాఠశాల విద్యార్థులకు జనవరి నెల మరోసారి ఆనందం పంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వరుస సెలవులు లభించాయి. అయితే అవి ముగిసిన వెంటనే మళ్లీ మరో విడత సెలవులపై చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ఈ నెల చివర్లో 4 రోజులపాటు సెలవులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి 16తో ముగిశాయి. 17వ తేదీ శనివారం కావడంతో పాఠశాలలు సాధారణంగా పనిచేయవు. కొన్ని పాఠశాలలు జనవరి 19 సోమవారం నుంచి తిరిగి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే పాఠశాలలు తెరుచుకున్న కొద్ది రోజులకే మరోసారి సెలవుల వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్నది విద్యార్థుల్లో ఆనందాన్ని పెంచుతోంది.
జనవరి నెల చివర్లో నిర్వహించే ప్రసిద్ధ మేడారం జాతర కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశాలపై చర్చ సాగుతోంది. సమ్మక్క- సారలమ్మ గిరిజన దేవతల మహాజాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఈసారి జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతర రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేడారం జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. జాతర జరిగే రోజుల్లో భద్రత, రవాణా నిర్వహణ కోసం ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కారణంగా రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి.
అడవుల నడుమ జరిగే మేడారం జాతరలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. భక్తులు మొక్కులు చెల్లించడం, బంగారం సమర్పించడం, దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణలు. సమ్మక్క-సారలమ్మలపై భక్తులకు ఉన్న అపార విశ్వాసమే ప్రతి రెండేళ్లకు ఒకసారి లక్షల మందిని మేడారం వైపు ఆకర్షిస్తోంది.
జాతర రోజుల్లో సాధారణ జనజీవనం కొంతమేర స్తంభించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం గతంలోనూ జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సంప్రదాయం కొనసాగితే ఈసారి కూడా జనవరి చివర్లో 4 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశం ఉందని విద్యావర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ వార్త విద్యార్థుల్లో ఆనందాన్ని నింపుతోంది.
ALSO READ: ఆధార్‌కార్డు ఉంటే మీ అకౌంట్లోకి రూ.90 వేలు.. ఇప్పుడే అప్లై చేస్కోండి!





