క్రైమ్జాతీయం

Goa Accident: గోవాలో ఘోర ప్రమాదం, 23 మంది దుర్మరణం!

గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోయారు.

Goa Fire Accident: ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ కమ్ క్లబ్ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న సహాయక సిబ్బంది, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అర్థరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌.. డీజీపీ అలోక్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గోవాలోని బిర్చ్‌ నైట్‌ క్లబ్‌ లో సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం ప్రమోద్‌ సావంత్‌.. స్పాట్ కు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లబ్‌ లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో ముగ్గురు కాలిపోయి మృతి చెందగా.. మిగిలినవారు ఊపిరాడక చనిపోయారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సావంత్ వెల్లడించారు.

దగ్గరుండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన డీజీపీ

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రంతా శ్రమించారు. గోవా డీజీపీ అలోక్ కుమార్ దగ్గరుండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించారు.  పోలీసులకు అర్ధరాత్రి దాటిన వెంటనే అప్రమత్తత సమాచారం అందిందని డీజీపీ తెలిపారు. ఆర్పోరాలోని  రెస్టారెంట్ కమ్ క్లబ్‌ లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. సరిగ్గా 12.04కు కంట్రోల్ రూమ్‌కి మంటల గురించి సమాచారం వచ్చిందన్న ఆయన.. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్‌ లను సంఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు. మంటల ఆర్పివేత కొనసాగుతుందని డీజీపీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button