తెలంగాణ

2027లోనే తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది ముందుగానే జరగనున్నాయా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2027లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయా.. అంటే కేంద్ర సర్కార్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో అవుననే తెలుస్తోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని బీజేపీ సర్కార్ యోచిస్తోంది. పార్లమెంట్ లో జమిలీ బిల్లు పాసైతే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే జరిగితే 2027లోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచనలో మోడీ టీం ఉందని తెలుస్తోంది. జమిలీ ఎన్నికలు వస్తే తెలంగాణ ఏడాది ముందు… ఏపీలో రెండేళ్ల ముందే ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీ కోర్ అంశాల్లో కీలకమైన జమిలి ఎన్నికలు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేలా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు విధివిధానాలు, సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిటీ కొన్ని నెలల పాటు విశ్లేషణలు, అభిప్రాయాలు సేకరించి ఒక రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. కోవింద్ కమిటీ సిఫార్సులకు తాజాగా గురువారం నరేంద్ర మోదీ అధ్యక్షత భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. ఆమోదముద్ర వేసింది. కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది.

దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని బీజేపీ వాదిస్తోంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్.. 18,626 పేజీల సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించిన నివేదికను ప్రారంభించారు. పలువురు నిపుణులు ఆధ్వర్యంలో 191 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రిపోర్ట్‌ను పూర్తిచేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button