
2026: ఇప్పటికే అత్యంత వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు రాబోయే నెలల్లో మరింత ఎగసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల భద్రతా ఆస్తులపై పెరుగుతున్న ఆదరణ వంటి అంశాలు కలిసి పసిడి ధరలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ అంచనా ప్రకారం.. 2026లో బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలతో పోలిస్తే కనీసం 15-30 శాతం వరకు పెరగవచ్చని భావిస్తోంది.
గత ఏడాది అమెరికా అమలు చేసిన అధిక దిగుమతి సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులను మరింత భద్రత కోసం పసిడిలోకి మళ్లేలా చేశాయి. బంగారం సంప్రదాయంగా అత్యంత సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుండడంతో, ఆర్థిక ప్రమాదాలు పెరిగినప్పుడు దాని కొనుగోళ్లు పెరగడం సహజమే. దీనితో ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ గణనీయంగా పెరిగి ధరలు భారీగా ఎగిసిపోయాయి.
అంతేకాకుండా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా ఎన్నో దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను మరింత బలపరచుకోవడానికి బంగారం కొనుగోళ్లను భారీగా పెంచాయి. ఈ కొనుగోళ్లు మార్కెట్లో సరఫరాను తగ్గించడంతో ధరలు మరింతగా పెరిగాయి. మరోవైపు, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, మారుతున్న ద్రవ్య విధానాలు కూడా పసిడి విలువను పెంచాయి. ఈ ప్రభావాల సమ్మిళితంగా గత కాలంలో బంగారం ధరలు దాదాపు 53 శాతం పెరిగినట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది.
ముఖ్యంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడుల్లో వచ్చిన భారీ వృద్ధి బంగారానికి అదనపు బలం ఇచ్చింది. పసిడిపై నేరుగా కొనుగోలు చేయకుండా పెట్టుబడి పెట్టే ఒక ప్రధాన వేదికగా ఈటిఎఫ్‌లు ప్రపంచ పెట్టుబడిదారులను భారీగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గ్లోబల్ గోల్డ్ ఈటిఎఫ్‌లలో మొత్తం డబ్బు ప్రవాహం డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం 77 బిలియన్ డాలర్లు చూశాయి. రూపాయల విలువలో చూస్తే ఇది దాదాపు ఏడు లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెట్టుబడులతో ఈటిఎఫ్‌ల హోల్డింగ్స్ మొత్తం 700 టన్నులకుపైగా పెరిగాయి.
ఇదిలావుండగా, బంగారం ధరలు ఎగబాకినప్పటికీ ఇతర విభాగాల్లో పసిడి వినియోగం మందగించింది. ఆభరణాల మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా తగ్గినా ఈటిఎఫ్ పెట్టుబడుల వృద్ధి ఆ లోటును భర్తీ చేసిందని సంస్థ చెప్పింది. పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా ఆభరణాల కొనుగోలుకంటే మార్కెట్లోని ఆర్థిక సాధనాల ద్వారా ఫండ్ పెట్టడం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒక్క దిశగా సాగవచ్చని కాదు. కొన్ని ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటే 2026లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని డబ్ల్యూజీసీ హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే కాలంలో అమలు చేయనున్న ఆర్థిక విధానాలు గ్లోబల్ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అతను తీసుకునే విధానాలు పూర్తిగా అమలైతే అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మరింతగా పెరిగి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు బలపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు వెంటనే భద్రత కోసం పసిడిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోవచ్చు. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గి ధరలు 5 నుంచి 20 శాతం వరకు పడిపోవచ్చని అంచనా.
ప్రపంచ వృద్ధి మెరుగుపడితే పెట్టుబడులు అధిక రాబడి వచ్చే విభాగాల దిశగా మళ్లే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పసిడి ధరలు పడిపోవడం సహజమని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి, 2026 బంగారం మార్కెట్ ఎలా మారుతుందనేది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రధాన దేశాల రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోంది.
ALSO READ: Funny video: కుక్క, బాతుల విన్యాసాలు.. మాములుగా లేవుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..





