
Musi Gates Open: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, ప్రాజెక్టులలోకి భారీగా వరదలనీరు వచ్చి చేరుతోంది. తాజాగా వర్షాలతో మూసీ వరద నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూడో, ఎనిమిదో నెంబర్ గేట్లను ఓపెన్ చేసి వాటర్ రిలీజ్ చేశారు. రెండు గేట్ల ద్వారా 1,293 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
మొరాయించిన క్రస్ట్ గేట్లు
మూసీ గేట్లు ఓపెన్ చేసే సమయంలో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. గేట్లు తెరుస్తున్న సమయంలో కరెంట్ పోయింది. వెంటనే అధికారులు జనరేటర్ సాయంతో గేట్లను ఎత్తారు. వాస్తవానికి అధికారులు తొలుత రెండు, ఎనిమిదో నెంబర్ గేట్లను ఎత్తాలని పూజలు చేశారు. అనంతరం రెండో గేటు ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా, ఓపెన్ కాకుండా మొరాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు మూడో నెంబర్ గేటును ఓపెన్ చేశారు.
వేసవిలో రిపేర్లు చేయాల్సి ఉన్నా..
నిజానికి గతంలోనే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోయింది. ఆ గేటును అమర్చినా, మిగతా గేట్ల రిపేరు గురించి పట్టించుకోలేదు. గత వేసవిలోనే వీటిని మరమ్మతు చేయాల్సి ఉన్నా చేయలేదు. ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్రాజెక్టు పూర్తిగా నిండితే మిగతా అన్ని గేట్లు ఓపెన్ అవుతాయో? లేదో? అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
మూసీ ప్రాజెక్టు లేటెస్ట్ అప్ డేట్స్..
మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 643.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.08 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 1753 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1293 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
Read Also: రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు