
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :-
2013 లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష సరైనదేనని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మంగళవారం హైకోర్టు లో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు వ్యక్తులకు ( యాసిన్ భత్కల్ అసదుల్లా అక్తర్, రెహమాన్, షేక్ యజాజ్, తహసన్ అత్తర్ ) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
గతంలో ( ఎన్ఐఏ ) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన 2013 ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా, 131 మంది అంగవైకల్యులయ్యారు.
అప్పట్లో సంచలనం కలిగించిన ఈ బాంబు పేలుళ్ల కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా ఏ1 నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. మిగతా ఐదుగురికి 2016 లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా వారు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు మంగళవారం తుది తీర్పును ప్రకటించింది. ఐదుగురు నిందితులకు కూడా ఉరిశిక్ష సరైనదేనంటూ తుది తీర్పును వెలువరించింది.
ఇదిలా ఉండగా ఉరిశిక్ష అమలు ఎప్పుడు అనేది నిర్ణయం కాకపోవడంతో నిందితులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు నిందితుల తరుపు న్యాయవాది పేర్కొన్నారు.