క్రైమ్

శ్రీచైతన్య విద్యా సంస్థలకు షాక్.. సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ బిగ్ షాకిచ్చింది. మాదాపూర్‌‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. శుక్రవారం నాడు ఈ కిచెన్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.

వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు.సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్‌, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు, కిచెన్‌ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

ఈ మేరకు అధికారులు మాదాపూర్‌‌ ఖానామెట్‌ లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్‌ కిచెన్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Back to top button