శబరిమల వెళుతున్న అయ్యప్ప స్వాములకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన చేశారు. శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మజీద్ కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి అన్నారు. అయ్యప్పలు నిష్ఠగా మాల వేసి 41 రోజులు దీక్ష చేసి, సమాధి ఉన్న మజీద్‌లోకి వెళ్తే అపచారమని అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మజీద్‌కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని… అది కుట్రలో భాగమని రాజాసింగ్ అన్నారు.
అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్‌లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ మార్గమధ్యలో, ఈనెల 7 నుంచి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్, కార్పొరేటర్లు శంకర్ యాదవ్, రాకేష్ జైస్వాల్ హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.