
విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే వార్తే. ఏంటి ఇదంతా నిజమేనా..? అని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్. ఆ…. ఇందతా ప్రచారమే… అని కొట్టిపారేసే వాళ్లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా.. ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే… అసలు అలాంటి ప్రచారం జరగడానికి గల కారణాలు ఏంటి..? అందులో ఏ మాత్రం అవకాశం ఉందో చూద్దాం.
విజయసాయిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. పార్టీకి ప్రధానమైన పిల్లర్ అని కూడా చెప్పొచ్చు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్ కేసులో A-2 నిందితుడు కూడా. అయితే… ఉన్నట్టుండి వైఎస్‌ఆర్‌సీపీకి ఆయన రాజీనామా చేయడం షాకిచ్చింది. రాజీనామా సమయంలో… ఇక పాలిటిక్స్‌లో ఉండను… రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి… బీజేపీలో చేరుతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ… ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తానని గట్టిగా చెప్పారు. చెప్పడమే కాదు… ఆ తరహా ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సీన్ కట్ చేస్తే… విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిలను కలిశారని వార్తలు వచ్చాయి. తాను షర్మిలను కలవలేదని సాయిరెడ్డి చెప్పినా… కలిశారని, ఎన్నో విషయాలు చర్చించామని షర్మిల మీడియా ముఖంగా చెప్పేశారు. ఆ తర్వాత… ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో.. చాలా మంది విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పారని కూడా వార్తలు ఇచ్చాయి. అప్పటి నుంచి అందరిలో అనుమానాలు… అగ్నికి ఆజ్యం పోసినట్టు… ఆ తెల్లారి నుంచి విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారన్న ప్రచారం గుప్పుమంది. అందుకు అవకాశం కూడా లేకపోలేదులేండి.
విజయసాయిరెడ్డి 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ కూడా ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత రిలేషన్ ఉంది. అందుకే విజయసాయిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వెనుక బీజేపీ ఉందన్న వార్తలు వచ్చాయి.ఆయన బీజేపీలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. ఇప్పుడు.. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవీకాలం త్వరలోనే ముగియబోతోంది. దీంతో.. ఆ పదవి కోసం విజయసాయిరెడ్డి లాబీయింగ్ చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో… తమిళనాడు గవర్నర్ పదవి దక్కించుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం.
విజయసాయిరెడ్డికి నిజంగా గవర్నర్ పదవి ఇస్తే.. టీడీపీ రియాక్షన్ ఏంటి..? అన్నదానిపై ఇప్పుడు చర్చజరుగుతోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఏకంగా గవర్నర్ పదవి ఇస్తే… ఊరుకుంటుందా…? కచ్చితంగా ఊరుకోదు. అంతేకాదు.. ఏపీలో కూటమి పార్టీల మధ్య ఉన్న సయోధ్యలోనూ తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటి..? అన్నది తెలియాల్సి ఉంది.