తెలంగాణ

ప్రతి ఎకరాకు 7500.. రైతుల అకౌంట్లో జమ.. వాళ్లకు కట్!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక రైతు భరోసాపై ఫోకస్ చేసింది. నిజానికి రైతు భరోసా జూలై, ఆగస్టు నెలలోనే ఇయాల్సి ఉంది. అయితే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యమైంది. రైతు బంధుకు బైబై చెప్పేశారని విపక్షాలు ఆరోపిస్తుండటంతో దసరాకు ముందే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.

ఈ సారి ఎకరాకు 7వేల 500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్​ చేయనున్నారు.ఆ వెంటనే విడతలవారీగా రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరికాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా రూల్స్ మార్చారని తెలుస్తోంది.

పంటలు పండని రాళ్లు, రప్పల బీడు భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృథాగా చెల్లించినట్టు తేల్చింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధివిధానాల ఖరారుకు సీఎం రేవంత్​ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతుభరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

గతంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. సర్కారుపై 7వేల 600 కోట్ల భారం పడేది. ఎకరాకు 7500 ఇస్తే ఈ భారం మరింత పెరగనుంది.దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.రేవంత్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో పాత పద్దతిలోనే 15 వేల కోట్లు కేటాయించింది. అయితే మారిన రూల్స్ తో కొందరికి కోత పడుతున్నందున… లెక్క సరిపోతుందనే అంచనాలో వ్యవశాయ అధికారులు ఉన్నారు. రైతులు ఏయే పంటలు వేశారో ఏఈఓలు ట్యాబులో నమోదు చేశారు. దాని ప్రకారమే రైతు భరోసా ఇవ్వనున్నారు.

మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయ సేకరణలో ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక కేబినెట్ భేటీలో మార్గదర్శకాలు ఫైనల్​ చేయనున్నారు. ఈ సారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే చాన్స్​ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు 1వేయి 500 కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button