
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలో దారుణ ఘటం జరిగింది. తన పిల్లలు చదువులో వెనకబడ్డారనే కారణంతో ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. సొంత పిల్లలను కిరాతకంగా చంపేశాడు. పిల్లల చనిపోయిన తర్వాత తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గోదావరి జిల్లాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
తాడేపల్లి గూడెం వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు హోలీ పండుగ సందర్భంగా చంద్రకిశోర్ తన భార్య తనూజను, ఇద్దరు కుమారులు ఒకటో తరగతి చదివే జోషిల్ (7), యూకేజీ చదివే నిఖిల్ (6)ను తీసుకొని తన ఆఫీస్‌కి వెళ్ళాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని నమ్మించి ఇంటికి వెళ్ళాడు
ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన చంద్రకిశోర్, పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి చంపేసి, తాను ఉరి వేసుకొని చనిపోయాడు. 10 నిమిషాల్లో వస్తానన్న భర్త ఎంత సేపటికీ రాకపోవడంతో, ఫోన్ ఎత్తకపోవడంతో తనూజ, తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్ళింది. ఇంటి కిటికీలో నుంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి చనిపోయి ఉన్నారు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోటు దొరికిందని పోలీసులు తెలిపారు.కాగా తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై విచారణ జరపాలని చంద్రకిషార్ అన్న వాపోయాడు.