
పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి కేసులో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 14న కాకినాడలో తన ఇద్దరు కుమారులు ఒకటో తరగతి చదివే జోషిల్ (7), యూకేజీ చదివే నిఖిల్ (6)ను బకెట్ ముంచి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నారు తండ్రి చంద్రకిషోర్. ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.
తన ఇద్దరు పిల్లలంటే చంద్రకిషార్ కు ఎంతో ప్రేమని పోలీసులు గుర్తించారు. ఇటీవల పిల్లలను రూ. లక్షన్నర ఫీజు చెల్లించి చదివించలేమనే ఉద్దేశంతో, రూ.50 వేలు ఫీజున్న స్కూలుకు మార్చారు. అయితే పిల్లల స్కూల్ మార్చినప్పటి నుంచి చంద్రకిషోర్ మనవేదనతో ఉన్నారని తెలిసింది. కార్పొరేట్ స్కూల్ నుంచి సాధారణ స్కూల్ కు పిల్లలను మార్చడం ఆయన తట్టుకోలేకపోయారని బంధువులు చెప్పారు.
ఇక ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ చంద్రకిశోరే రాసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఆ సూసైడ్ నోట్లో తమ పిల్లలు సరిగా చదవట్లేదని, ఈ పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరని, కష్టాలొస్తాయని.. వాటిని తాను చూడలేనని, తన భార్య చాలా మంచిదని రాశారు చంద్రకిషోర్. కేసు దర్యాప్తులో వేరే కోణాలు కనిపించలేదని, మిగతా తల్లిదండ్రులంతా ఈ కేసును ఉదాహరణగా తీసుకుని తమ పిల్లల చదువు విషయంలో ఒత్తిడి తేవద్దని, చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తుపై నిర్ధారణకు రాకూడదని హితవు పలికారు పోలీసులు.