హైదారాబాద్ మహా నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బాలానగర్, కూకట్ పల్లి, మియాపూర్, సనత్ నగర్ ప్రాంతాల్లో అరగంట సేపు కుండపోతగా వర్షం కురిసింది. కాసేపు తెరపి ఇచ్చిన వరుణుడు మళ్లీ కుమ్మేశాడు.
హైదరాబాద్ వెస్ట్, నార్త్ జోన్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు కుండపోతగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కు ఏకంగా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మాదాపూర్, బాలాపూర్ , గచ్చిబౌలి, శేరిలింగం పల్లి, మియాపూర్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఖైరతాబాద్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురుస్తోంది. వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోయాయి. పీక్ అవర్స్ కావడంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జాంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. రెండు , మూడు గంటలైనా రెండు, మూడు కిలోమీటర్లు కూడా వాహనాలు కదలడం లేదంటే వర్షం ఏ రేంజ్ లో కురుస్తోందో ఊహించవచ్చు. భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలెవరు రోడ్లపైకి రావొద్దని జీహెచ్ఎంసీ సూచించింది. ఐటీ ఉద్యోగులు ఇప్పుడే కార్యాలయాల నుంచి బయటికి రావొద్దని అలెర్ట్ ఇచ్చారు అధికారులు.