
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడి హాస్టల్లో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన మండేలా మనీషా అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హాస్టల్ గదిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ప్రాథమికంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తండ్రికి ఉన్న అప్పులు, తాను ఎదుర్కొంటున్న ఒంటరితనం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం.
అయితే లభించిన సూసైడ్ నోట్‌పై పోలీసులు పూర్తిస్థాయిలో నిర్ధారణకు రాలేదు. అది నిజంగా మనీషానే రాసిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆమె మొబైల్ ఫోన్లోని డేటా, కాల్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలాగే హాస్టల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మనీషా చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఆమెకు ఎవరైనా ఫోన్ చేశారా? ఘటనకు ముందు ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైందా? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన అనంతరం దర్యాప్తును మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది. సూసైడ్ నోట్, మొబైల్ డేటా, సీసీటీవీ దృశ్యాలు సహా అందుబాటులో ఉన్న ఆధారాలను విశ్లేషించిన తర్వాతే యువతి మరణానికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
also read: మాధవన్ కొత్త అవతారం.. అంతర్జాతీయ బిజినెస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా!