
క్రైమ్ మిర్రర్ : కేవలం రూ.20 వేల అప్పు విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ శివారులోని డ్రీమ్ మెడోస్ వెంచర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బోడికే ప్రేమ్ కుమార్ (18) హత్య కేసును కొత్తూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ నవాజుద్దీన్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
రూ.20 వేల అప్పుతో మొదలైన వివాదం
కొత్తూరు పోలీస్ స్టేషన్లో సీఐ నాగార్జున రెడ్డితో కలిసి ఏసీపీ లక్ష్మీనారాయణ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14న డ్రీమ్ మెడోస్ వెంచర్ వద్ద ప్రేమ్ కుమార్ హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి బోడికే లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ గతంలో ప్రేమ్ కుమార్‌కు రూ.20 వేలు అప్పుగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ డబ్బును తిరిగి చెల్లించాలని ఇర్ఫాన్ కోరగా, వెంటనే చెల్లించడం సాధ్యం కాదని ప్రేమ్ కుమార్ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు వెల్లడించారు.
బీరు తాగుదామని పిలిచి హత్య
అప్పు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ప్రేమ్ కుమార్‌ను బీరు తాగుదామని చెప్పి ఇర్ఫాన్ వెంచర్ వద్దకు పిలిచినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు నవాజుద్దీన్‌ను కూడా ఐదు బీరు సీసాలతో అక్కడికి రప్పించినట్లు వివరించారు. ముగ్గురూ కలిసి బీరు తాగుతున్న సమయంలో రూ.20 వేల అప్పు విషయమై మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ కత్తితో ప్రేమ్ కుమార్‌పై దాడి చేశాడు. ఛాతీ, పొత్తికడుపు, వీపు తదితర భాగాల్లో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు నవాజుద్దీన్ బాధితుడిని పట్టుకుని దాడికి సహకరించినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
హత్య కేసును సవాలుగా తీసుకున్న కొత్తూరు పోలీసులు మృతుడి మొబైల్ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను విశ్లేషించారు. ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల ఆచూకీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ చౌరస్తా వద్ద గురువారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ నవాజుద్దీన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు.
హత్యకు ఉపయోగించిన కత్తి, వాహనాలు స్వాధీనం
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, మొబైల్ ఫోన్లు, నీలం రంగు హోండా యాక్టివా స్కూటర్‌తో పాటు టీజీ 12 టీ 7545 నంబరు గల ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌పై గతంలోనూ హైదరాబాద్‌లోని బహదూర్‌పుర, షాద్‌నగర్, కొత్తూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు బృందానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్యవేక్షణలో, షాద్‌నగర్ జోన్ డీసీపీ సి. శిరీషా మార్గదర్శకత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు సీఐ బి. నాగార్జున రెడ్డి, ఎస్ఐ ఎం. గోపాలకృష్ణతో పాటు ఇతర పోలీసు సిబ్బంది కేసు ఛేదనలో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.
also read : మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం