
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకమైన అంచనాలను వ్యవసాయ శాఖ వెలువరించింది. ఈసారి రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, సాధారణ సాగు విస్తీర్ణమైన 68.67 లక్షల ఎకరాలను మించి రికార్డు స్థాయిలో పంటల సాగు జరుగుతుందని అంచనా వేయడం విశేషం. వాతావరణంలో వస్తున్న మార్పులు మరియు నీటి కొరత ముప్పును ముందే గ్రహించిన వ్యవసాయ శాఖ, తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వర్షపాతంతో వణికిపోతున్న చెన్నై
ఈసారి భూగర్భ జలాలు మరియు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగును పెంచేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నారు.ముఖ్యంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), నువ్వులు, కుసుమ వంటి నూనెగింజల పంటలతో పాటు శనగ, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగును విస్తృతంగా ప్రోత్సహించనున్నారు. రైతులు సమర్థవంతమైన నీటి నిర్వహణ పాటించి, ఆరుతడి పంటలు వేసుకోవడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి మంచి దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ