
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పదవ రోజు దివ్య విమాన రథోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కొండపైన ఆలయ మాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు అర్చకులు. ఆలయ పునర్నిర్మాణానంతరం మూడోసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
శ్రీ లక్ష్మీ సమేతుడై దివ్య స్వర్ణ విమాన రథంలో ఆశీనులై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను తన్మయ పరిచారు యాదగిరి నరసింహుడు. వేద మంత్రాలు, పారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలు, సంగీత, సాహిత్య కార్యక్రమాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండువగా సాగింది. లోక కల్యాణం కోసం శ్రీ లక్ష్మీదేవిని పరిణయమాడిన నృసింహుడి జంటను దివ్య విమాన రథోత్సవం లో చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
దివ్య విమాన రథంలో ఆశీనులై ఊరేగుతున్న లక్ష్మీ నరసింహుడిని చూసి భక్తులు ఆనంద పరవశం చెందారు. రథోత్సవ ఊరేగింపులో పెద్దఎత్తున పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు చేసారు. నరసింహుడు రథోత్సవంలో ఊరేగుతున్నంతసేపు భక్తులు యాదగిరి వాసా గోవిందా.. లక్ష్మీ నరసింహ గోవిందా” నామస్మరణతో కొండపై ఆలయ తిరు వీధులు మార్మోగాయి.