
క్రైమ్ మిర్రర్ : ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరాకు పాల్పడిన ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది. డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న తన ప్రియుడిని బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో యువతి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రూ.50 వేల కమిషన్ ఆశ చూపి..
వివరాల్లోకి వెళ్తే.. కాశీవర్ధన్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు విజయవాడలోని పటమటకు చెందిన అతడి ప్రియురాలు నాగసౌమ్య ప్రయత్నించింది. ఇందుకోసం అవసరమైన డబ్బు సమకూర్చుకోవాలని డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చిన మొత్తాన్ని కూడబెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నాగసౌమ్య డ్రగ్స్ దందాలో పాల్గొంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కృష్ణలంకకు చెందిన బషీర్ ఆమెకు రూ.50 వేల కమిషన్ ఇస్తానని చెప్పడంతో డ్రగ్స్ తీసుకురావడానికి అంగీకరించినట్లు తెలిసింది.
బెంగళూరు నుంచి ఎండీఎంఏ సరఫరా
బషీర్ సూచనల మేరకు నాగసౌమ్య బెంగళూరుకు వెళ్లి 110 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు తిరిగి వస్తుండగా పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. రైలు ద్వారా విజయవాడకు చేరుకున్న ఆమెను అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న బషీర్‌ను కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలే!
కాశీవర్ధన్, నాగసౌమ్య ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రియుడికి బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నంలో నాగసౌమ్య డ్రగ్స్ సరఫరా మార్గాన్ని ఎంచుకోవడం ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read : పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు.. అప్పూ మరణంపై డాక్టర్ కీలక వ్యాఖ్యలు!