
జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:- ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కలిగిన వారే, తమ తప్పులను ప్రశ్నించినందుకు ఒక బాలిక భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో వెలుగు చూసిన ఈ ఘటన విద్యా వ్యవస్థకే మచ్చగా మారింది.
అసలేం జరిగిందంటే..? కోరుట్ల ప్రాంతానికి చెందిన వి. మేరి అనే 9వ తరగతి విద్యార్థిని, తన పాఠశాలలో అన్నం సరిగ్గా పెట్టడం లేదని, మెనూ పాటించడం లేదని గతంలో ఉన్నతాధికారులకు (కలెక్టర్ గారికి) ఫిర్యాదు చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే ఆ బాలిక చేసిన పాపమైంది.
వేధింపులు – బహిష్కరణ
ఫిర్యాదు చేసినప్పటి నుండి సదరు ఎస్.ఓ (S.O) మేడం విద్యార్థినిని మానసికంగా వేధించడం ప్రారంభించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “నీ వల్ల స్కూల్‌కు చెడ్డ పేరు వస్తోంది, నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్లు వినాలి, లేదంటే బయటకు పంపించేస్తా” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సదరు విద్యార్థిని తన లేఖలో పేర్కొంది. అన్నట్టుగానే, ఆ బాలికపై లేనిపోని నిందలు వేసి నెల రోజుల క్రితం పాఠశాల నుండి పంపించివేశారు.
దిక్కులేని స్థితిలో విద్యార్థిని:-
పేద కుటుంబానికి చెందిన ఆ బాలికకు దిక్కులేక ప్రస్తుతం ‘బాలసదనంలో’ ఆశ్రయం పొందుతోంది. చదువుకోవాల్సిన వయసులో, కేవలం నిజం మాట్లాడినందుకు ఒక విద్యార్థినిని ఇలా రోడ్డున పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
”నన్ను అన్యాయంగా స్కూల్ నుండి పంపించేశారు. నేను చదువుకోవాలి, నాకు న్యాయం చేయండి” అని ఆ బాలిక కలెక్టర్ గారికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రశ్నార్థకమైన అధికారుల తీరు:
సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, ఫిర్యాదు చేసిన విద్యార్థినిని ఎందుకు రక్షించలేకపోయారు? ఒక చిన్నారిని పాఠశాల నుండి పంపించే అధికారం ఎస్.ఓ కి ఎవరు ఇచ్చారు?
నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? జగిత్యాల జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, ఆ విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని, బాధ్యులైన ఎస్.ఓ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
Read also : ఫోన్ ట్యాపింగ్: హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట..!
Read also : రోజా VS జనసేన అభిమానులు.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్?





