
పేదరికం అడ్డంకిగా మారినా.. పిల్లల భవిష్యత్తు కోసం ఓ మహిళ చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్తను కోల్పోయిన ఓ వితంతువు తన ఇద్దరు పిల్లలు, వృద్ధ అత్తమామల బాధ్యతను మోస్తూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కఠోరంగా శ్రమించింది. చివరకు హోంగార్డు నియామకంలో భాగంగా నిర్వహించిన పరుగు పరీక్షలో అద్భుతమైన ప్రతిభ చూపి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన కవితా కుమారి ఈ స్ఫూర్తిదాయక ప్రయాణానికి కేంద్రబిందువుగా నిలిచారు. సోసో గ్రామానికి చెందిన ఆమె భర్తను కోల్పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో పాటు అత్తమామల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే కవితకు శిక్షణ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రన్నింగ్ షూస్, ట్రాక్‌సూట్ వంటి కనీస అవసరాలు కూడా సమకూర్చుకోలేకపోయారు. అయినప్పటికీ ఆమె లక్ష్యాన్ని వదులుకోలేదు. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి చీరలోనే పరుగు సాధన చేసేవారు.
హోంగార్డు భౌతిక సామర్థ్య పరీక్షలో భాగంగా 1600 మీటర్ల పరుగును 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే కవిత మాత్రం మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా కాళ్లకు చెప్పులు లేకుండానే పరుగెత్తారు. తనపై ఉన్న బాధ్యతలు, ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కేవలం 6 నిమిషాల్లో 1600 మీటర్ల పరుగు పూర్తి చేశారు.
కవిత పరుగెత్తుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆమె పరిస్థితి, పట్టుదల, కష్టపడే తీరును చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆమె సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కవిత ప్రతిభ గురించి తెలుసుకున్న స్థానిక రన్నింగ్ గ్రూప్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఆమెను సత్కరించడంతో పాటు భవిష్యత్తులో అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
రామ్‌గఢ్ జిల్లాలో మొత్తం 284 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 5 వరకు నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇందులో 50 శాతం పోస్టులను మహిళలకు కేటాయించగా.. అదనంగా 5 శాతం పోస్టులు వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు రిజర్వ్ చేశారు.
జీవితంలో ఎదురైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ పిల్లల కోసం కవిత చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. సౌకర్యాలు లేకపోయినా సంకల్పం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆమె నిరూపించారు.
also read: ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ? కొత్త పార్టీపై జోరుగా ప్రచారం.. అసలు నిజమేంటి?