
క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ నగర శివారులోని తట్టి అన్నారం ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం, నాగోల్ బండ్లగూడ బస్‌డిపో వెనుక గోల్డెన్ లీవ్స్ విల్లాస్‌కు వెళ్లే మార్గంలో మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మృతురాలిని ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్యేశ్వర్నగర్కు చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. మంగమ్మ గత నెల 28వ తేదీన కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే దాదాపు పది రోజుల తర్వాత తట్టి అన్నారం ప్రాంతంలో ఆమె మృతదేహం వెలుగులోకి వచ్చింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన కొంతమంది స్థానికులు నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వద్ద కుక్కలు సంచరిస్తుండటాన్ని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.
మృతదేహం వద్ద మద్యం సీసాలు కూడా కనిపించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఇన్చార్జి ఏసీపీ రవీందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. మంగమ్మను ఎవరైనా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు పూర్తయిన తర్వాతే మహిళ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగమ్మ అదృశ్యమైనప్పటి నుంచి మృతదేహం లభ్యమయ్యే వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె చివరిసారిగా ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్లింది, ఆమెతో ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read: పుట్టినరోజు నాడే జవాన్ వీరమరణం…