
వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం మాత్రమే కాదు. అది జీవితాంతం పాటు కొనసాగాల్సిన బంధం. ప్రేమకు మించిన అర్థం కలిగిన ఈ సంబంధం రెండు కుటుంబాలను ఒకటిగా ముడిపెడుతుంది. అలాంటి వివాహ బంధం ఆరోగ్యంగా, ఆనందంగా కొనసాగాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ సమానంగా అవసరం. అందుకే పెళ్లికి ముందు కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకంగా మారుతోంది.
ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా భవిష్యత్తులో ఎలాంటి అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. పెళ్లి తర్వాతే సమస్యలు తెలిసి ఇబ్బందులు పడే కంటే, ముందే అవగాహనతో నిర్ణయం తీసుకోవడం దాంపత్య జీవితానికి బలమైన పునాదిని వేస్తుంది. వైద్య నిపుణులు కూడా పెళ్లికి ముందు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా తలసేమియా స్క్రీనింగ్ పెళ్లికి ముందు చేయించుకోవాల్సిన కీలక పరీక్షల్లో ఒకటి. తలసేమియా అనేది జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే, అది పిల్లలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి జీవితాంతం చికిత్స అవసరమయ్యే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే వివాహానికి ముందు ఇద్దరూ ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చు.
అలాగే లైంగిక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు కూడా అత్యంత అవసరం. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, గోనేరియా వంటి వ్యాధులు వెంటనే లక్షణాలు చూపకపోయినా.. కాలక్రమంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేయించుకుని స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం వల్ల దాంపత్య జీవితంలో నమ్మకం పెరుగుతుంది.
సంతానోత్పత్తి విషయంలో కూడా ముందస్తు అవగాహన చాలా ముఖ్యం. ప్రతి జంట తల్లి తండ్రులు కావాలని కలలు కంటారు. అయితే ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఎవరిలోనైనా ఉండే అవకాశం ఉంది. ఫెర్టిలిటీ ప్రొఫైల్ టెస్టుల ద్వారా ఈ అంశాలను ముందే గుర్తించవచ్చు. అవసరమైతే ముందుగానే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
రక్త వర్గం పరీక్ష కూడా సాధారణంగా కనిపించినా దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ. ముఖ్యంగా Rh నెగటివ్ మరియు Rh పాజిటివ్ కలయిక ఉన్న జంటలకు గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ముందే తెలుసుకుని వైద్య సలహాలు తీసుకుంటే సమస్యలను సులభంగా నివారించవచ్చు.
ఇక జన్యుపరమైన స్క్రీనింగ్ కూడా ఆధునిక వైద్య పరీక్షల్లో కీలకమైనది. కుటుంబ చరిత్రలో మధుమేహం, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి సమస్యలు ఉంటే అవి భవిష్యత్ తరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జన్యుపరమైన పరీక్షల ద్వారా ఈ ప్రమాదాలను ముందే అంచనా వేసి జీవితంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఈ అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వివాహ జీవితంలో అనవసరమైన అపోహలు, అనుమానాలు దూరమవుతాయి. ఆరోగ్యమే నిజమైన సంపద అన్న మాటకు అర్థం తెలిసివస్తుంది. ప్రేమ అయినా, పెద్దల అనుమతితో జరిగే వివాహమైనా ముందుగా వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడితే భవిష్యత్తు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ALSO READ: రూ.15 కోట్లతో తెరకెక్కి రూ.900 కోట్లకు పైగా రాబట్టిన భారతీయ చిత్రం





