
– స్కూల్ నుంచి సరిహద్దు దాకా.. డ్రగ్స్‌పై ఏపీ సర్కార్ కొత్త ప్లాన్
– యువత, విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయం
– ఈగల్ క్లబ్‌లు, సేఫ్ క్యాంపస్ జోన్లను మరింత విస్తరించనున్న ప్రభుత్వం
– గంజాయి అక్రమ రవాణాపై సరిహద్దుల్లో డ్రోన్లతో నిఘా
– డ్రగ్స్ కేసుల్లో 20 మెడికల్ షాపులపై చర్యలు, 36 జాగిలాలతో తనిఖీలు
క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఒకవైపు విద్యార్థులు, యువతలో అవగాహన.. మరోవైపు మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన నిఘా.. ఇంకోవైపు డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు. మాదకద్రవ్యాల నియంత్రణను కేవలం పోలీసుల బాధ్యతగా కాకుండా అన్ని విభాగాలు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
యువతను లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రభావం నుంచి విద్యార్థులు, యువతను రక్షించడానికి ఒక్క కార్యక్రమంతో సరిపోదని, అనేక మార్గాల్లో చర్యలు కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘ఈగల్ క్లబ్’లను మరింత క్రియాశీలం చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ‘ఆపరేషన్ చైతన్యం’, విద్యాసంస్థల చుట్టుపక్కల ‘సేఫ్ క్యాంపస్ జోన్’, యువతను ఉద్దేశించి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమాలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులతో ప్రతి నెలా టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మంత్రుల బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలనే నిర్ణయం కూడా సమావేశంలో తీసుకున్నారు.
ఇతర రాష్ట్రాల అనుభవాలపై దృష్టి
డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచే ఉద్దేశంతో త్వరలో విశాఖపట్నంలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ నిర్వహించాలని నిర్ణయించారు. సింథటిక్ డ్రగ్స్‌ను అడ్డుకోవడంలో పంజాబ్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి, ఉపయోగకరమైన అంశాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను లోకేశ్ కోరారు.
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒడిశా వైపు నుంచి రాష్ట్రంలోకి గంజాయి చేరకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు, నిఘాను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. అవసరమైన చోట డ్రోన్లను ఉపయోగించి అక్రమ రవాణా మార్గాలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ప్రజలు సమాచారం ఇచ్చేలా ‘బ్రేక్ ద సైలెన్స్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో విస్తరించాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
36 జాగిలాలతో ప్రత్యేక తనిఖీలు
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పట్టుబడిన గంజాయి చాక్లెట్ల మూలాలను పరిశీలించగా అవి బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ సమాచారంతో ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్న 20 మెడికల్ షాపులను మూసివేసినట్లు తెలిపారు. విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లోని బ్లేడ్ బ్యాచ్‌ల కదలికలపైనా కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అక్రమ రవాణాను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 36 జాగిలాలను రంగంలోకి దించారు. రాపిడ్ డ్రగ్ డిటెక్షన్ కిట్ల సహాయంతో అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 192 మంది పాత నేరస్థులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రవికృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.