
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్టోబర్ 30 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటికే ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసి.. మిగితా 9 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెబుతున్నందున… వాళ్లను సేఫ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పోరాడటంతో పాటు ప్లాన్ బీ అమలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు కేటీఆర్. భారీ సభలు నిర్వహిస్తున్నారు. గద్వాలలో సభ పెట్టిన కేటీఆర్.. త్వరలో భద్రాచలం వెళ్లనున్నారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయం మరింత రాజుకుంది. కడియంకు ఓపెన్ సవాల్ చేస్తున్న రాజయ్య.. వరుస కార్యక్రమాలతో దూకుడు పెంచారు. తాజాగా రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పోస్టు కార్డులు పంపుతున్నారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు.
బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినందుకే మీకు ఓటు వేశామని, పార్టీ మారినందున రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడియం శ్రీహరికి పోస్ట్ కార్డులు పంపుతున్నారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఓటర్లు. రోజుకు వందలాది పోస్టు కార్డులు వస్తుండటంతో కడియం శ్రీహరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తోంది. పరువు నిలుపుకునేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో కడియం శ్రీహరి ఉన్నారని చెబుతున్నారు.