
క్రైమ్ మిర్రర్ : అమెరికాలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హిమాన్షు భాహూ, నీరజ్ ఫర్దిపురియా అరెస్టయ్యారు. హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన పలు కేసుల్లో వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 22న లాస్ వెగాస్‌లో వీరిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అందించిన సమాచారంతో పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. నిందితులను భారత్‌కు తీసుకొచ్చేందుకు హర్యానా ఎస్టీఎఫ్ అధికారులు అమెరికా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా హిమాన్షు భాహూ
హిమాన్షు భాహూ అసలు పేరు హిమాన్షు రిటోలియా. హిమాన్షు సిగ్రోహ పేరుతో పాస్‌పోర్టు పొందినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా వ్యవహరిస్తూ నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతని పేరు ఉంది. హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు సంబంధించిన కేసులు అతనిపై నమోదయ్యాయి. ఇంటర్‌పోల్ నోటీసుల్లోనూ అతని పేరు ఉన్నట్లు సమాచారం. పోర్చుగల్‌లోని క్రిమినల్ నెట్‌వర్క్‌లతో పాటు నీరజ్ భవానా, నవీన్ బాలీ గ్యాంగ్లతోనూ అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నీరజ్ ఫర్దిపురియాపై 25 క్రిమినల్ కేసులు
మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ ఫర్దిపురియా హర్యానాలోని పాల్వాల్ జిల్లాకు చెందినవాడు. అతనిపై సుమారు 25 క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. 2012లో హర్యానా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2015లో హత్య కేసులో జీవిత ఖైదు విధించగా, 2019లో హర్యానా, పంజాబ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి హత్య కేసులోనూ అతని పేరు తెరపైకి వచ్చింది. అనంతరం దుబాయ్ మీదుగా కెనడాకు వెళ్లిన అతను, అక్కడ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రత్యర్థిగా ఉన్న ముఠాకు నాయకత్వం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి హిమాన్షు భాహూతో కలిసి పనిచేసినట్లు సమాచారం. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలోనూ నీరజ్ ఫర్దిపురియా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరి అరెస్టుతో అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్ల నెట్‌వర్క్‌పై దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
also read : భర్తల చేతిలో భార్యల హతం.. ! శివన్నగూడెంలో వరుస హత్యల కలకలం…