
క్రైమ్ మిర్రర్ : దసరా సెలవులు సరదాగా గడపాల్సిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. చెరువులోని తామర పూలను కోసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన ఆ చిన్నారులు చదువుల్లో రాణించి, భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలుస్తారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, విధి ఆ కుటుంబాల ఆశలను ఆవిరి చేసింది. కళ్లముందే పెరిగిన పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మంచి స్నేహితులు.. ఒకే తరగతిలో చదువు
ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కొలకలూరి నిషిత్ బాబు (12), కండ్లగుంట నాగచైతన్య (11) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆటపాటల్లోనే కాకుండా చదువులోనూ చురుగ్గా ఉండేవారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినప్పటికీ వారి మధ్య స్నేహం ఎంతో బలంగా ఉండేది.
దసరా సెలవులు రావడంతో రోజూ మాదిరిగానే ఇద్దరూ సరదాగా ఆటలాడుకుంటూ గ్రామంలోని ఊర చెరువు దక్షిణం వైపు వెళ్లారు. అక్కడ నీటిలో కనిపించిన తామర పూలను చూసి వాటిని కోసుకోవాలనే ఆసక్తి కలిగింది. దీంతో చెరువులోకి దిగారు. అయితే, నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు.
లోతు తెలియక నీటిలోకి.. అంతలోనే విషాదం
చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు నీట మునిగిపోయారు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ నీటిలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చిన్నారులు చెరువులోకి దిగిన విషయాన్ని తొలుత ఎవరూ గుర్తించలేదు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న కొందరు చెరువు గట్టుపై చిన్నారుల చెప్పులను గమనించారు. అనుమానం వచ్చి చెరువులో పరిశీలించగా ఇద్దరు విద్యార్థులు నీటిలో కనిపించారు. దీంతో వారు వెంటనే కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. స్థానికులు చెరువులోకి దిగి ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
ఆటలతో, అల్లరితో ఇళ్లలో సందడి చేయాల్సిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతితో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారనుకున్న తమ పిల్లలు చిన్న వయసులోనే దూరమవడంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దసరా సెలవుల సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ విషాదం మరోసారి గుర్తుచేస్తోంది.
also read: భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్.. రెండు కార్లు సీజ్