
క్రైమ్ మిర్రర్ : జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఓ మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. దుర్గాపూజ వేడుకల కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె, పండుగ ముగించుకుని అత్తింటికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని గయా జిల్లా బరచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేవాలియా గ్రామానికి చెందిన ఊర్మిళా దేవి (35), దినేష్ సింగ్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. దుర్గాపూజ సందర్భంగా ఊర్మిళా దేవి జార్ఖండ్‌లోని తతి ఝరియా ప్రాంతం ఖైరా-కర్మ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది.
పండుగ ముగియడంతో బుధవారం పిల్లలతో కలిసి అత్తింటికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో మార్గమధ్యంలోని బర్హి చౌక్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఊర్మిళా దేవి, ఆమె చిన్న కుమారుడు దీపాన్షు కుమార్ (4) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాద స్థలంలో మృతదేహాలతో పాటు పిల్లల ఆటవస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో అక్కడి దృశ్యాలు స్థానికులను కలచివేశాయి. సమాచారం అందుకున్న బర్హి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
also read : పండగ పూట విషాదం.. ఎనిమిది నెలల వైవాహిక జీవితానికి విషాదాంతం