
ముంబైలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కేవలం పదేళ్ల వయసున్న బాలిక చేసిన పనికి 18 నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. గోరెగావ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని గోరెగావ్లో బుధవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక 18 నెలల చిన్నారిని తీసుకుని భవనంలోని ఆరో అంతస్తుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి పసిబిడ్డను కిందకు తోసేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు భవనంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిన్నారిని పై అంతస్తుకు తీసుకెళ్లిన బాలిక, ఆ తర్వాత అక్కడి నుంచి కిందకు తోసేసి మెట్ల మార్గంలో వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి.
పిల్లి విషయంలో గొడవే కారణమా?
ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లి విషయంలో తలెత్తిన గొడవ ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాగే బాలిక మానసిక పరిస్థితికి సంబంధించి కూడా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయాలేవీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
బాలిక, తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పదేళ్ల బాలికతో పాటు ఆమె తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగింది? చిన్నారిని కిందకు తోసేయడానికి గల కారణాలేంటి? ఈ ఘటనలో మరిన్ని అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కాగా, పసిబిడ్డ మృతికి దారితీసిన అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిన్న వయసులోనే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
also read: బంగాళాదుంప కూర వడ్డించిందని భార్యపై భర్త దాడి.. రాయితో తలపై బాది హత్యాయత్నం!