
Big Relief For Kerala Nurse: కేరళ నర్సు నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆమెకు ఉరి అమలు చేయాల్సి ఉంది. కానీ, ఓ వైపు భారత ప్రభుత్వం ప్రయత్నం, మరోవైపు బాధిత కుటుంబంతో మత పెద్దల చర్చల నేపథ్యంలో శిక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘బ్లడ్ మనీ’ గురించి మృతుడి బంధువులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉరి శిక్ష అమలును నిలిపి వేసిన యెమన్
వాస్తవానికి నిమిష ప్రియకు ఉరి అమలును నిలిపివేయాలని కోరుతూ భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఎలాగైనా ఆమెను శిక్ష నుంచి తప్పించాలనే ఉద్దేశంతో యెమన్ తో చర్చలు జరుపుతోంది. భారత విదేశాంగ అధికారులు బాధిత కుటుంబంతో పాటు జైలు అధికారులు, న్యాయశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ యెమెన్ నిర్ణయం తీసుకుంది.
రంగంలోకి దిగిన మత పెద్దలు
అటు నిమిష చేతిలో హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబ సభ్యులతో.. కేరళలోని కాంతపురం గ్రాండ్ ముఫ్తీ ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నారు. అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు.. కుటుంబ సభ్యులు చర్చలలో పాల్గొన్నారు. ఓ వైపు మత పెద్దలు, మరోవైపు భారత ప్రభుత్వ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో యెమన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉరిశిక్ష అమలును నిలిపివేసింది. త్వరలోనే ఉరిశిక్షపై అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బాధిత కుటుంబానికి నిమిష ఫ్యామిలీ 10 లక్షల డాలర్లు వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, మృతుడి కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. ఒకవేళ వాళ్లు బ్లడ్ మనీకి ఒప్పుకుంటే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉంటుంది. తన బిజినెస్ పార్ట్ నర్ ను నిమిష హత్య చేయడంతో ఆమెకు యెమన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. చివరిక్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: భారత్- అమెరికా వాణిజ్య చర్చలు.. వాషింగ్టన్ కు ఇండియా టీమ్!