
హైదరాబాద్ నగరంలో ప్రమాదకరంగా ద్విచక్ర వాహనాలతో స్టంట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లైఓవర్లపై నిబంధనలు పట్టించుకోకుండా వేగంగా వాహనాలు నడపడంతో పాటు వీలీస్ వంటి ప్రమాదకర విన్యాసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 6న నగరంలోని ఓ ఫ్లైఓవర్‌పై ముగ్గురు యువకులు మూడు హోండా డియో స్కూటర్లతో ప్రమాదకర విన్యాసాలకు పాల్పడ్డారు. వేగంగా వాహనాలు నడుపుతూ, వీలీస్ చేస్తూ వీడియోలను చిత్రీకరించారు. అంతేకాకుండా వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండానే స్టంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం ఆ వీడియోలను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియోలను పరిశీలించడంతో పాటు ఫ్లైఓవర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ ఆధారాల ద్వారా నిందితులను మహమ్మద్ మోహినుద్దీన్ అలియాస్ మోహిన్ (24), మహమ్మద్ రిజ్వాన్ (21), తోహిద్ (19)గా గుర్తించారు. అనంతరం ముగ్గురినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ప్రమాదకర స్టంట్లపై పోలీసుల హెచ్చరిక
బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు తొలగించడం, అతివేగంగా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని యువతను హెచ్చరించారు.
అదేవిధంగా మైనర్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలు వాహనాలు నడిపినా, ప్రమాదకర విన్యాసాలకు పాల్పడినా వాహన యజమానులైన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ప్రాణాలకు, ఇతర వాహనదారుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా రోడ్లపై స్టంట్లు చేయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని పోలీసులు పేర్కొన్నారు.
also read: నానా పటేకర్ మృతి.. తీవ్ర భావోద్వేగంలో రామ్ గోపాల్ వర్మ