Monday, February 23, 2026
Homeతెలంగాణఉగాదిలోపే వారికి ఇందిరమ్మ ఇళ్లు!

ఉగాదిలోపే వారికి ఇందిరమ్మ ఇళ్లు!

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో (క్యూర్- కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) సొంత స్థలం కలిగి ఉన్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రంగం సిద్ధం చేసింది. ఉగాది పండుగకు ముందుగానే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఈ 3 జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు జల్లెడ పట్టి పరిశీలించగా, అందులో సుమారు 18 వేల మంది అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే తుది జాబితా ఖరారు చేసే ముందు మరోసారి పునఃపరిశీలన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరిశీలన ప్రక్రియను కేవలం వారంలోగా పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ధృవీకరణ బాధ్యతను 3 కమిషనరేట్ల పరిధిలోని సిబ్బందికి అప్పగించాలని ఉన్నతాధికారులు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనలకు సూచనలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో పాటు అదనంగా మరో 28 వేల మంది లబ్ధిదారులకు రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత స్థలం లేని నిరుపేదలకు జంటనగరాల్లో ఇప్పటికే నిర్మాణం చివరి దశకు చేరుకున్న గృహాలను అందజేయనున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇళ్ల మంజూరు ప్రక్రియను పూర్తిచేయాలని మూడు జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు కమిషనర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త కాలనీల్లో రహదారులు, తాగునీటి సరఫరా, పాఠశాలలు వంటి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం మీద ఈ నగర వలయ పరిధిలో వచ్చే నెలాఖరు వరకు 50 వేల మందికి గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, అందులో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలాఖరు వరకు మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ మినహా ఇతర నగర ప్రాంతాల్లో కూడా గృహ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గృహ పథకం కింద ఇప్పటికే 1.13 లక్షల ఇళ్లు మంజూరు చేసింది.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 12 లక్షల దరఖాస్తులు రావడం విశేషం. అందులో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు కేవలం 18 వేల మంది మాత్రమే ఉండటం గమనార్హం. నగరంలో 100 గజాల స్థలం ఉన్నా దానిని ఆక్రమణల నుంచి కాపాడుకోవడం కష్టసాధ్యమవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సొంత స్థలం అనే అంశం అనుమానాస్పదంగా మారింది. ఈ పరిస్థితుల్లో స్లమ్ ప్రాంతాల్లో భూమి కొరతను దృష్టిలో ఉంచుకుని 3 లేదా 5 అంతస్తులతో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలతో నగర పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ALSO READ: Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి మరో హీరోయిన్ ఫిదా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments