
Musk Launches America Party: అమెరికా చరిత్రలో మరో పార్టీ పుట్టుకొచ్చింది. అపర కుబేరుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీని స్థాపించారు. తాజాగా పార్టీ పేరును ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికాలో రెండు పార్టీలు ఉండగా, ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీ రూపు దిద్దుకుంటుంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలోని అసంతృప్త నాయకులు కొత్త పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
ట్రంప్ తో మస్క్ కు విభేదాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్’ను ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మస్క్ ఆ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ ఈ బిల్లును అమలు చేస్తే, తానే ఓ కొత్త పార్టీని పెడతానని చెప్పారు. మస్క్ ఎంత ప్రయత్నం చేసినా, బిల్లు ఆమోదం పొందింది. రీసెంట్ గా ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లు అమల్లోకి వచ్చింది. మస్క్ ముందుగా ప్రకటించినట్లుగానే కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
‘అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ప్రకటన
మస్క్ తన పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అమెరికా ప్రజలకు తాను స్థాపించి పార్టీ కావాల్సిన పార్టీ అని మస్క్ ప్రకటించారు. ట్రంప్ సారథ్యంలోని పార్టీ విధానాలను చూస్తుంటే.. ప్రజాస్వామ్యంలో కాకుండా ఓ పార్టీ పాలనలో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు కారణంగా అమెరికాను నష్టాల్లోకి నెట్టే వృథా ఖర్చులు, అవినీతి పెరగనున్నట్లు మస్క్ విమర్శించారు. అమెరికా ప్రజలకు మళ్లీ స్వేచ్ఛను అందించేందుకే తాను అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు కావాల్సిన రాజకీయ పార్టీ తాను స్థాపించిన పార్టీయేనన్నారు.
Read Also: మస్క్ దుకాణం సర్దేయాల్సిందే.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!