జాతీయంతెలంగాణవైరల్

‘కుర్చీ తాత’ చనిపోయాడని ప్రచారం.. క్లారిటీ (VIDEO)

హైదరాబాద్‌ కృష్ణానగర్‌ పరిసరాల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం గడుపుతున్న ఓ ముసలాయన నోట నుంచి వచ్చిన ఒక్క డైలాగ్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు.

హైదరాబాద్‌ కృష్ణానగర్‌ పరిసరాల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం గడుపుతున్న ఓ ముసలాయన నోట నుంచి వచ్చిన ఒక్క డైలాగ్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. కుర్చీని మడతపెట్టి అనే మాట ఓ ఇంటర్వ్యూలో భాగంగా రావడంతో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ డైలాగ్‌లోని సహజత్వం, మాట్లాడిన తీరు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కాలా పాషా అనే మహ్మద్ పాషా పేరు కాస్తా కుర్చీ తాతగా మారిపోయింది. సోషల్ మీడియా నుంచి యూట్యూబ్ వరకు ఆ డైలాగ్‌ ట్రెండ్‌గా మారింది.

ఈ వైరాలిటీ ఇంతటితో ఆగలేదు. ఏకంగా సినిమా పాట స్థాయికి చేరింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో సంగీత దర్శకుడు తమన్ ఆ డైలాగ్‌ను పాటలో వినియోగించడంతో కుర్చీ తాత పేరు సినీ ప్రేక్షకులకు కూడా చేరింది. పాట విడుదలైన తర్వాత ఆయన క్రేజ్ సెలబ్రిటీ స్థాయికి వెళ్లింది. పలు ఇంటర్వ్యూలు, మీడియా కార్యక్రమాల్లో పాల్గొంటూ కుర్చీ తాత ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన బయట కనిపించకపోవడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం అనుమానాలకు దారి తీసింది.

ఈ క్రమంలో కుర్చీ తాత చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేశాయి. గాంధీ ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉందంటూ రూమర్లు వైరల్ కావడంతో చాలామంది నమ్మేశారు. కొందరు సోషల్ మీడియాలో RIP పోస్టులు కూడా పెట్టారు. దీంతో కుర్చీ తాత నిజంగానే చనిపోయారా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది. ఫేక్ న్యూస్‌ వేగంగా వ్యాపించడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

ఈ తప్పుడు ప్రచారంపై చివరకు కుర్చీ తాత స్వయంగా స్పందించారు. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తన మరణం గురించి వార్తలు రాసిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రతికుండగానే నన్ను చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలాంటి తప్పుడు వార్తలతో తన కుటుంబాన్ని బాధపెట్టవద్దని కోరారు. ఈ వార్తలు విని తన భార్య తీవ్రంగా కంగారుపడి ఏడ్చిందని చెప్పుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక ఈ వ్యవహారంపై ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య కూడా స్పందించారు. కుర్చీ తాత భార్య ఆసియా సుల్తానాతో కలిసి వీడియో విడుదల చేసి నిజాన్ని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహం ఉందన్న వార్త తెలుసుకుని అక్కడికి వెళ్లామని, అది కుర్చీ తాత డెడ్‌బాడీ కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం కుర్చీ తాత వరంగల్‌లో క్షేమంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. భార్యతో పాటు కుర్చీ తాత కూడా స్పందించడంతో ఈ ఫేక్ న్యూస్‌కు పూర్తిగా చెక్ పడింది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఇలాంటి తప్పుడు మరణ వార్తలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రతికుండగానే చనిపోయారని ప్రచారం చేయడం వల్ల ఆయా వ్యక్తులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి. కుర్చీ తాత ఉదంతం కూడా అదే కోవకు చెందింది. నిర్ధారణ లేకుండా వైరల్ చేసే ఫేక్ న్యూస్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. బాధ్యత లేని ప్రచారాల వల్ల సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది. కుర్చీ తాత విషయంలో నిజం బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ: VIRAL: అమ్మాయి దుస్తులు చించేసి.. దారుణం! (VIDEO)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button