
– ధాన్యం పండించే రాష్ట్రంలోనే ప్రియం
– ఒకేసారి 65% పెరిగిన రేట్లు
– సామాన్య, మధ్యతరగతి వారి జీవనం పై ప్రభావం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- తెలంగాణలో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల పాలిట ఇది భారంగా మారుతోంది. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుంది. అటువంటి రాష్ట్రంలో ఇప్పుడు బియ్యం ధరలు చూస్తుంటే మండిపోతున్నాయి ముఖ్యంగా అందరూ ఇష్టపడే సోనామసూరి బియ్యం ధరలు గత ఏడాదితో పోల్చుకుంటే.. 65 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. వంట గదిలో నిత్యం ఉపయోగించే ప్రధాన ఆహార ధాన్యం ధరలు అకస్మాత్తుగా పెరిగిపోవడం వినియోగదారులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కేంద్ర గణాంకాల ప్రకారం..
ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు విడుదల చేసింది. తెలంగాణలో సోనారకం బియ్యం హోల్సేల్ ధరలు గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగాయి. 2025 అక్టోబర్లో క్వింటా సోనామసూరి బియ్యం ధర రూ. 2,068 ఉండగా.. తాజా అంచనాల ప్రకారం ఏకంగా రూ. 3,419 కు చేరుకుంది. అంటే ఏడాది కాలంలోనే ధర దాదాపు 65.4% పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో బియ్యం ద్రవ్యోల్బణం రేటు కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో నాలుగు శాతం ఉండగా.. సెప్టెంబర్ నాటికి ఏకంగా 13 శాతానికి ఎగబాకింది. దీంతో నిత్యవసరాలకు కొనుగోలు సామాన్యులకు భారంగా మారుతుంది. గత ఏడాది మధ్యలో కొంత స్థిరంగా ఉన్నాయి బియ్యం ధరలు. కానీ క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది పెను భారమే.
కుటుంబ జీవనం కష్టం..
కుటుంబ జీవనం కష్టంగా మారుతుంది.. సగటు ఒక కుటుంబం పై అదనపు భారం పడుతుంది. ఆరుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలవారీగా కనీసం 25 కిలోల బియ్యం అవసరం. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరగడంతో నెలవారి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బియ్యం వినియోగం ఎక్కువ. ఈ డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే బియ్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలంగాణకు సంబంధించి మార్కెట్లలో దోపిడీ వ్యాపార పద్ధతులు, సరైన మార్కెట్ మౌలిక వసతులు లేకపోవడం.. ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని హార్దిక విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాల్లో పంట దిగుబడి బాగుండడంతో అక్కడ ధరలు ఇంతగా పెరగలేదని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వర్షపాతంలో మార్పులు, వాతావరణ పరిస్థితులు కూడా మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం మార్కెట్ ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.