
– నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
– ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఆంక్షలు విధిస్తున్నారని ప్రియాంక విమర్శ
– ఎస్ఐఆర్ను నిలిపివేయాలని జైరాం రమేశ్ డిమాండ్
– ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు కాంగ్రెస్ నేత పట్టుబాటు
క్రైమ్ మిర్రర్,న్యూఢిల్లీ:- ఓటర్ల జాబితా సవరణపై మొదలైన నిరసన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో ఆందోళనకు దిగిన యువతను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతాయనే ఆందోళనతోనే నిరసనలను అణచివేస్తున్నారని ఆరోపించారు.
నిరసనలపై ఆంక్షలు.. కాంగ్రెస్ మండిపాటు
ఢిల్లీలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ)కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో యువతను అదుపులోకి తీసుకోవడంపై ప్రియాంకా గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. గతంలో 254 మంది ఎంపీలను ఇబ్బందులకు గురిచేసి, అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష నిరసనకారుల విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు.రాజధానిలో రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించేలా ఆంక్షలు విధించడంతో పాటు, రైళ్లు, మెట్రో సేవలను అడ్డుకుంటున్నారని, ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నారని ఆమె ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కుతో శాంతియుతంగా నిరసన తెలిపే యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం సహకారంతో అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. దేశంలో ప్రజాస్వామ్యానికి బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని ప్రియాంక విమర్శించారు.
ఎస్ఐఆర్ను ఆపాలన్న జైరాం రమేశ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సైతం ఢిల్లీలోని పరిణామాలపై స్పందించారు. నిరసన తెలిపే యువతను చూసి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దేశ రాజధానిని కోటను తలపించేలా మార్చేశారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం కల్పించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
14 కోట్ల ఓట్ల తొలగింపుపై ఆరోపణ
దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది భారతీయుల ఓటు హక్కులను ఇప్పటికే తొలగించారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నెలకొనాలంటే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలు, ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.