
Nagarjuna Sagar Dam Water Level: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.
ప్రాజెక్టులలోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో
ఇక ప్రధాన జలాశయాలు అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 48,143 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.46 టీఎంసీలకు చేరుకుంది. పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 89,938 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి దిగువకు నీటి విడుదలను అధికారులు పెంచారు. జూరాలకు 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 41 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద పెరిగిన నేపథ్యంలో మరింత ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ ఎంత నిండిందంటే?
ఇక నాగార్జునసాగర్ లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 67,604 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఔట్ ఫ్లో 7,849 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 561.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 236 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల 18న నీరు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులోని 30 వేల ఎకరాలకు ఈ నెల 18 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
Read Also: ఇవాళ, రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!