
నాగాలాండ్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో రాయగడకు చెందిన అసోం రైఫిల్స్ జవాన్ వి. తేజ (30) వీరమరణం పొందారు. అక్టోబర్ 7న, తన పుట్టినరోజునే ఆయన ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
తేజకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. సుమారు నెల రోజుల క్రితమే నిశ్చితార్థం జరగగా.. డిసెంబర్ 10న వివాహం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన తేజ ఇలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దీపావళి పండుగకు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడపాలని తేజ భావించినట్లు తెలుస్తోంది. అయితే అంతలోనే నాగాలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యుల ఆశలు విషాదంగా మారాయి.
తేజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలించి, అక్కడి నుంచి రాయగడకు తీసుకురానున్నారు. స్వస్థలానికి ఆయన భౌతికకాయం చేరుకున్న అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పెళ్లి ఏర్పాట్లతో సందడిగా మారాల్సిన ఇంట్లో తేజ మృతితో విషాదం నెలకొంది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన తేజకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.