
Nagarjuna Sagar Dam: భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశంలోని చాలా రాష్ట్రాలు వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి. అందుకే, రైతులకు మెరుగైన సాగునీటి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నాగార్జునసాగర్ జలాశయాన్ని నిర్మించింది. దేశంలోని అతిపెద్ద బహుళార్థసాధక ఆనకట్టలలో ఒకటిగా కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో కృష్ణా నదిపై ఈ జలాశయాన్ని నిర్మించింది. ఈ ప్రాజెక్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తితో పాటు వరద నియంత్రణ కోసం నిర్మించబడింది.
సమస్యల వలయంలో సాగర్ ప్రాజెక్టు
ప్రస్తుతం ఈ జలాశయం అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నది. అందులో ముఖ్యమైనది పూడిక. నిజానికి నాగార్జునసాగర్ జలాశయం అసలు నీటి సామర్థ్యం 408.24 టీఎంసీలు. కానీ, గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణా నది వరదల కారణంగా జలాశయంలో పూడిక జమ అవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. 2024-2025 నాటికి, జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు తగ్గింది. అంటే, 96.24 టీఎంసీల మేర జలాశయంలో పూడిక జమ అయ్యింది. జలాశయ సామర్థ్యంలో దాదాపు 24% నష్టానికి కారణం అయ్యింది. పూడిక వల్ల అసలు డెడ్ స్టోరేజ్ 179.16 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఇది 168 టీఎంసీలకు చేరింది. ఇది సాగునీటి సరఫరాతో పాటు 22,35,910 ఎకరాల ఆయకట్టు, 810 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది.
సాగర్ జలాశయంలో పూడికతీత సాధ్యమేనా?
నాగార్జునసాగర్ లో పూడికతీత అనేది సాధ్యం కాదని చెప్పలేం. కానీ, దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాలు అవసరం. పూడికను తీయడంతో పాటు పూడిక రాకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
⦿ అటవీ సంరక్షణ: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో ఉన్న అడవులను కాపాడటంతో పాటు చెట్ల నాటడం ద్వారా నేల కోతను తగ్గించవచ్చు. అడవులు నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు ఇసుక, బురదను జలాశయంలోకి రాకుండా అడ్డుకుంటాయి.
⦿ మట్టి సంరక్షణ చర్యలు: ఎగువ ప్రాంతాల్లో టెర్రసింగ్, కాంటూర్ ప్లోయింగ్, గట్టు నిర్మాణం వంటి పద్ధతులు మట్టిని స్థిరీకరిస్తాయి. పూడిక ప్రవాహాన్ని తగ్గిస్తాయి.
⦿ వర్షపు నీటి నిర్వహణ: వర్షపు నీటిని సమర్థవంతంగా నిల్వ చేసే చెక్ డ్యామ్లు, చిన్న రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా వరద ప్రవాహాన్ని తగ్గించి, పూడిక రాకుండా నియంత్రించవచ్చు.
⦿ హైడ్రాలిక్ ఫ్లషింగ్: వరద సమయంలో ఆనకట్ట గేట్లను తెరిచి, జలాశయంలో జమ అయిన పూడికను నీటి ప్రవాహంతో కొట్టుకుపోయేలా చేయవచ్చు.
⦿ సెడిమెంట్ బైపాస్ సిస్టమ్స్: జలాశయంలోకి పూడిక రాకముందే దానిని దారి మళ్లించే సొరంగాలు, బైపాస్ కాలువలు నిర్మించడం. ఇది ఖర్చుతో కూడిన పద్ధతి కానీ దీర్ఘకాలంలో ప్రభావవంతంగా ఉంటుంది.
⦿ డ్రెడ్జింగ్: యంత్రాల ద్వారా పూడికను తొలగించడం. కానీ, ఇది ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణ ప్రభావాలను పరిగణించాలి. నాగార్జునసాగర్ లో పూడిక మొత్తం ఎక్కువగా ఉన్నందున, ఈ పద్ధతి అమలు అంత ఈజీ కాదు.
పూడికతీతలో ఎదురయ్యే సవాళ్లు
నాగార్జునసాగర్ పూడికతీత వ్యవహారం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. డ్రెడ్జింగ్, సెడిమెంట్ బైపాస్ సిస్టమ్స్ లాంటి పద్దతుల ద్వారా పూడికతీత సాధ్యమే అయినప్పటికీ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో క్యూబిక్ మీటర్ పూడిక తొలగింపుకు రూ.500 నుంచి రూ. 1000 వరకు ఖర్చవుతుంది. నాగార్జునసాగర్ లో పూడిక లక్షల క్యూబిక్ మీటర్లలో ఉంటుంది. అటు డ్రెడ్జింగ్ లేదంటే ఫ్లషింగ్ చేయడం ద్వారా జలచరాలు ప్రభావితమవుతాయి. తొలగించిన పూడికను పారబోసే వ్యవహారం కూడా పెద్ద సవాలుగా మారనుంది.
ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయా?
నిజానికి 2010-2018 మధ్య ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి పథకం కింద నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ జరిగింది. ఈ పథకం ద్వారా కాలువలు, గేట్లు, ఇతర నిర్మాణాల మరమ్మతులపై దృష్టి సారించారు, మొత్తం ఖర్చు రూ. 4,444 కోట్లు అయ్యింది. అయితే, ఈ ఆధునీకరణలో పూడిక తీతపై ప్రత్యేక దృష్టి సారించలేదు. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించి, రిపేర్ల కోసం ఖర్చులను భరిస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పూడిక సర్వేలు నిర్వహించింది. రూ. 90 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ, డ్రెడ్జింగ్, ఫ్లషింగ్ పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియన పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీ, నిర్వహణ విషయాల్లో ఉన్న వివాదాలు పూడిక తీతకు అడ్డంకిగా ఉన్నాయి.
నిర్మాణ సమస్యలు, సీపేజీ ఇబ్బందులు
అటు నాగార్జునసాగర్ జలాశయం నిర్మాణంలో నీటి లీకేజీ సమస్యలను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా 490 అడుగుల నీటి మట్టంలో గ్యాలరీ దగ్గర లీకేజీ ఏర్పడింది. ఈ సమస్యలు ఆనకట్ట భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సీపేజీ వల్ల నీటి నష్టం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఆనకట్ట నిర్మాణ బలం తగ్గే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సీపేజీ సమస్యను పరిష్కరించేందుకు రిపేర్లు చేపడుతోంది. కానీ, ఇంకా పనులు పూర్తి కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పూడిక నిర్వహణకు దీర్ఘకాలిక విధానాలు రూపొందించడం తక్షణ అసవరంగా మారింది. లేదంటే, రానున్న రోజుల్లో సాగర్ తన సామర్థ్యాన్ని కోల్పోవడంతో పాటు తాగు, సాగు నీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి పైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
Read Also: అతి వినియోగం అనర్థమే, భావి భారతానికి ‘యాంటీ బయాటిక్స్’ ముప్పు!