
Good News: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి భారీ స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పట్టణానికి చేరుకొని మొత్తం రూ.262.78 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రాంత అభివృద్ధికి విద్య, రహదారులు, శాసన నిర్మాణాలు, ఉద్యోగావకాశాలు అన్నీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతం ముందుకు సాగుతుందని అన్నారు. పలు రంగాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు.
హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి రూ.44.12 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ కళాశాల ఏర్పడటం వల్ల స్థానిక యువతకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడమే కాకుండా, ప్రాంతంలో సాంకేతిక రంగ అభివృద్ధికి కూడా ఇది పునాది వేస్తుంది. అదేవిధంగా, ఈ ప్రాంతంలో నైపుణ్యావకాశాల పెరుగుదల వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.
హుస్నాబాద్‌లో ATC (అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటుకు రూ.45.15 కోట్లు, మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.20 కోట్ల నిధులు కేటాయించారు. తద్వారా పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. పౌరులకు మెరుగైన సేవలు, శుభ్రత, మౌలిక సదుపాయాల విస్తరణ తదితరాల పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు ఈ ప్రాజెక్టుల ద్వారా స్పష్టమవుతోంది. అదనంగా, RTA యూనిట్ ఆఫీస్ నిర్మాణానికి రూ. 8.60 కోట్లు కేటాయించడం ద్వారా రోడ్డు రవాణా వ్యవస్థలో పారదర్శకత, సేవల వేగం పెరగనుంది. ఇంతవరకు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పనులు ఇక స్థానికంగానే పూర్తయ్యే అవకాశం కలుగుతోంది.
అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రహదారుల నిర్మాణంలో కూడా భారీగా నిధులు కేటాయించడం మరో ముఖ్యమైన అంశం. హుస్నాబాద్ అర్బన్- కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కోసం రూ.86 కోట్లు, అలాగే హుస్నాబాద్- అక్కన్నపేట నాలుగు లైన్ రహదారి పనులకు రూ.58.91 కోట్లు మంజూరు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, వాణిజ్య రవాణా, పంటల రవాణా, పరిశ్రమల అభివృద్ధి వంటి అనేక రంగాలు లాభపడతాయి. ఈ రహదారులు పూర్తయ్యే సరికి ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభ్యుదయానికి కరీంనగర్ ప్రాంతం ఇచ్చిన చారిత్రక సహకారాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమానికి ఈ నేల పునాది వేసిందని పేర్కొంటూ, యువత కోసం చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాంతాచారి చేసిన బలిదానాన్ని ప్రస్తావించి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వరకు 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ఉద్యోగావకాశాలు విస్తరించడం, ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయ్యే సరికి హుస్నాబాద్ ఒక అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: Election Symbols: వార్డు, సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?





