
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి జాగరణ కోసం గుండాల కోన శివాలయానికి వెళ్తున్న భక్తులను తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
రేపు (బుధవారం) శివరాత్రి. ఈ సందర్భంగా గుండాలకోనకు బయలుదేరారు భక్తులు. ఆ సమయంలోనే ఏనుగులు దాడి చేసి.. ముగ్గురిని చంపేశాయి. గుండాలకోన శివాలయంలో శివరాత్రి పూజలకు.. ఏటా భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా ఉర్లగడ్డపోడు నుంచి 30 మంది భక్తులు రాత్రి గుండాలకోన బయలుదేరారు. ఆ మార్గమంతా అటవీ ప్రాంతం… 30 కిలోమీటర్లు ఫారెస్ట్‌లోనే నడవాలి. ఈ క్రమంలో ఓ ఏనుగుల గుంపునకు భక్తులు కంట పడ్డారు. జనాన్ని చూసిన ఏనుగులు… వెంటనే వారిపై దాడి చేశాయి. భక్తులను ఎత్తి పడేశాయి… కాళ్ల కింద పడేసి తొక్కేశాయి. ఏనుగుల దాడితో… భక్తులంతా పరారయ్యారు. ముగ్గురిని ఏనుగులు తొక్కి చంపాయి. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే వారిని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు. మరొకరి జాడ తెలియడంలేదు. అతని కోసం గాలిస్తున్నారు.
ఇక… పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో చొరబడ్డాయి ఏనుగులు. మిల్లు షట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాయి. మిల్లులోని ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురు చేశాయి. ఒక బస్తా బియ్యం కూడా మిగలకుండా చేశాయి.