అంతర్జాతీయం

ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తీవ్రంగా స్పందించిన భారత్‌!

India On Trump’s Tariff Provocation: మళ్లీ దిగుమతుల సుంకాలు పెంచుతామన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి? ఎంత కొనాలి? అని నిర్ణయించుకునే స్వేచ్ఛ…  భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం  స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్‌ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి మేం ఆయిల్ దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్‌ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక భారత్‌కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.  భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయి కదా?” అని ఎదురు ప్రశ్నించింది.

అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది!

భారత్ పై టారిఫ్ లు పెంచుతామని హెచ్చరికలు చేస్తున్న అమెరికా సైతం రష్యా మీద ఆధారపడుతోందనే విషయాన్ని మర్చిపోకూడదని భారత్ గుర్తు చేసింది. “అమెరికా తమ అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్‌ను, విద్యుత్‌ వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్‌ యూనియన్‌ ఏకంగా 67.5 బిలియన్‌ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్‌ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే విధానం కొనసాగిస్తుంది’’అని భారత్‌ తేల్చి చెప్పింది.

Read Also: భారత్ పై టారిఫ్ మరింత పెంచుతాం, ట్రంప్ సంచలన ప్రకటన!

Back to top button