తెలంగాణ

ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌!

Heavy Rains in Telangana: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్రిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒకపూట స్కూళ్లు నిర్వహించాలని ఆదేశించింది.

హైదరాబాద్ లో భారీ వర్షాలు

భాగ్యనగరంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. 13, 14, 15 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. మేడ్చల్‌ జిల్లాతోపాటు సైబరాబాద్‌ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 10 నుంచి 15 సెం.మీ వర్షపాతం పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో 20సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంత్రులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్  

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్‌ లిఫ్టింగ్‌ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్‌ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: వరంగల్లో భారీ వర్షాలు.. పూర్తిగా మునిగిపోయిన రైల్వే పట్టాలు!

Back to top button