
Rakshabandhan 2025: అన్నా చెల్లెళ్ల అనుబంధమై… అనుభూతుల స్మృతియై, అనురాగాల వెల్లువై మదిని మీటు సంబరం రాఖీ పౌర్ణమి. లేదా రక్షాబంధన్. పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే. ప్రేమానుబంధాల పల్లకిలో నీకిదే సుస్వాగతం అంటూ అక్కాచెల్లెళ్లు ఆహ్వానించే ఆరోజు ఈరోజే. నీకు నేను, నాకు నువ్వు అన్న మధుర భావనతో రాఖీ కట్టుకుని మురిసిపోయే అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ప్రత్యేకమైన రోజిది. ప్రతి గడపలో ఎదురు చూపు… ప్రతి మనసులో మైమరుపు… చెల్లి వస్తుందన్న ఆశతో… అన్న మనసు పులకరిస్తది. తమ్ముడొస్తడన్న ఆనందంతో అక్క మనసు పరవశిస్తది. నేస్తానికో రాఖీ అన్న భావంతో మనసు ఉప్పొంగుతది. హృదయ వీణా తంత్రులెవరో మీటినట్లవుతది. పరువాల పన్నీటి జల్లులెవరో చిలికినట్లనిపిస్తది.
అన్నా అన్న పిలుపులో ఎంత ఆనందమో… అక్కా అన్న పలకరింపులో ఎంత అనురాగమో… చెల్లీ అన్న మాటలో ఎంత అనుబంధమో…నేస్తం అన్న శబ్దంలో ఎంత తీయదనమో… అనుభవించే కొద్దీ అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఎన్నడూ తరగనివీ, ఎప్పటికీ మరువనివీ, ఏనాటికీ తనివి తీరనివీ, ఆత్మీయతానురాగాల మానవ సంబంధాలివి. ఎప్పుడూ ఉండేవే అయినా…అప్పుడప్పుడూ వాటి ప్రత్యేకతని లోకానికి చాటిచెప్పేందుకు, మరోసారి గుర్తు చేసుకునేందుకూ కొన్ని పర్వదినాలు వెలిసినయి. అలాంటి వాటిలో మేటిది ఈ నాటి రక్షాబంధన్.
అన్నా…నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం….అంటూ తెలుగు తీయదనాలు తెలిపే తెలుగు సినీపాట రాఖీపౌర్ణమికి గుర్తొస్తది.నిండు పున్నమి జాబిలి వెన్నెలలా… తెల్లగా…తేటగా…హాయిగా… పసిదనాల పూవుటెదలలో పడుచుకున్న రక్తగతమైనది ఈ రక్షా బంధన్. అన్నా చెల్లెల్ల,అక్కా తమ్ముళ్ల సంబంధానికి ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. ప్రతీయేటా శ్రావణమాసంలో వస్తదిఈ పౌర్ణమిని. సరి రాగాల సన్నటి దారాలతో పెనవేసిన జన్మజన్మల అనుబంధంతో ముడివేసిన పసిడి పూలు పురివేసిన ఎర్రటి తోరణంతో రాఖీ కడతరు. గోరింటాకుతో ఎర్రగా పండిన చిన్నిచేతుల మునివేళ్లతో అన్నా తమ్ముళ్ల ముంజేతులకు రాఖీ కట్టి నోరుతీపి చేసి నాకేమి ఇస్తావంటూ అమాయకంగా అడుగుతది చెల్లెలు.అన్న ఆప్యాయంగ చెల్లెలుకు నా ప్రాణాలైన ఇస్తనని చెమ్మరిల్లిన కళ్లలో ఆప్యాయతతో వెల్లడిస్తరు.దీనిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకునేందుకు చెల్లెలు ప్రయత్నిస్తది.
అమ్మలోని ఆప్యాయతను అందిపుచుకున్న అనురాగానివి నువ్వు, నాన్నలోని నిరాడంబరతవి నువ్వు, ప్రతి క్షణం ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు, అనుక్షణం అభిమానాన్ని అందించే అపురూపానివి నువ్వు,చిరునవ్వుల ఉదయాలతో నా గుండెలో ఆనందపు కిరణాలను ప్రసరింపచేస్తున్నవు, మధురమైన నీ మాటలతో నా మనసులొ చిరుజల్లులు కురిపిస్తున్నవు, ఈ ప్రేమ ప్రతి క్షణం నాకు నీడలా తోడుండాలని, నీకు ప్రతీక్షణం నేను తండ్రిలా తోడుంటానని ఈ రక్షాబంధనం ద్వారా తెలుపుతున్న అంటూ చిరునవ్వుల చెల్లెలికి అన్నయ్య రక్షాబంధనం శుభాకాంక్షలు అందిస్తడు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన వాళ్లు పండగల్ని తమ సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటరు… అది కృష్ణాష్టమి అయినా విజయదశమి అయినా.ఇక రక్షా బంధన్ అయితే… వారి కల్చర్ మరింత కలర్ఫుల్గా కనిపిస్తది.రాఖీ పండగను మనం ఒక విధంగా సెలబ్రేట్ చేసుకుంటే, సింధీస్ మరో విధంగా జరుపుకుంటరు. ఇక జైనుల ఆనవాయితీయే వేరు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ… అన్నతో పాటు వదినలకు కూడా రాఖీ కట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తరు. ఈ రాఖీ ద్వారా అన్న తమను అన్ని కష్టాల నుండి రక్షించాలని కోరుకుంటరు. ఇక అన్నదమ్ములైతే… ప్రతీ విషయంలోనూ అండగా ఉంటమని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇస్తరు. ఎలా జరుపుకున్నా పండగ పండగే… సంప్రదాయాలు వేరైనా అన్నా చెల్లెళ్ల అనుబంధం ఒక్కటే.
అన్నాచెల్లెళ్ల అనుబంధంతోపాటు విశ్వమానవ శాంతి సౌభ్రాతృత్వానికీ, మానవత్వానికీ ప్రతీకైనది ఈ రాఖీ పౌర్ణమి. అందరినీ అలరించే అనురాగాల హరివిల్లయి, ఆనందాల పొదరిల్లయి, తలపుల తలుపులు తట్టిన అనురాగ తరంగాల శ్రావణ పౌర్ణమినీ, మమతానురాగాల మధురవాహినినీ మనమూ ఆహ్వానిద్దాం.అన్నాదమ్ముల, అక్కా చెల్లెళ్ల ప్రేమానుబంధాలు పెనవేసుకున్న ఆనంద లోకంలో విహరిద్దాం.మరో సారి మీ అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు.