
కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలు తీవ్ర మానసిక వేదనలో ఉండటంతో, దాదాపు 10 రోజుల తర్వాత మాత్రమే విషయం బయటకు వచ్చింది. నిందితుల బెదిరింపుల కారణంగా బాధిత కుటుంబం భయాందోళనకు గురై మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.
కుప్పం మండలం ఎన్.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని నిమ్మకంపల్లి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడంతో ఆమెను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాధితురాలి భర్త కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో బాధితురాలి భర్త చేసిన ఆరోపణలు కలచివేసే విధంగా ఉన్నాయి. విషయం బయటకు చెబితే తనను, తన భార్యను, పిల్లలను హత్య చేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆయన తెలిపారు. ఆ బెదిరింపుల కారణంగా తన భార్య భయంతో ఎవరికీ చెప్పలేకపోయిందని, 10 రోజులుగా తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భద్రత కోసమే మౌనం పాటించాల్సి వచ్చిందని ఆయన కన్నీటితో వెల్లడించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ALSO READ: Affair: యువకుడితో ప్రేమలో పడిన ఐదుగురు పిల్లల తల్లి.. తర్వాత ఏమైందంటే?





