తన వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలు దొర్లాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం చెలరేగించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా!
‘‘ఇటీవల పలువురు హీరోయిన్స్ ఇబ్బంది పడిన సందర్భాన్ని ఉద్దేశిస్తూ ‘దండోరా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అసభ్య పదాలను ఉపయోగించా. వాటి వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బ తింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. ‘బయటకు వెళ్లినప్పుడు మంచి దుస్తులు వేసుకుని ఉంటే మీకు ఈ ఇబ్బంది ఉండేది కాదేమోనమ్మా’ అనే ఉద్దేశం తప్ప, ఎవరినీ అవమాన పరచాలని కాదు. ఏదైనా రెండు అసభ్య పదాలు దొర్లాయి. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. స్త్రీ అంటే శక్తి. నేను అమ్మవారిగా భావిస్తా. ప్రస్తుత సమాజంలో మహిళను తక్కువగా చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వవద్దని చెప్పే ఉద్దేశంతో ఊరి భాష మాట్లాడా. ఆ పదాలు దొర్లకుండా ఉంటే బాగుండేది. ఒకటి మాత్రం చెబుతున్నా, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప, ఇందులో ఎవరినీ అవమానపరచాలని, కించపరచాలని ఉద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే మీ అందరికీ మరోసారి క్షమాపణలు’’అని చెప్పుకొచ్చారు.
శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
నటుడు శివాజీ వ్యాఖ్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నందినిరెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్, లక్ష్మి మంచు, ఝాన్సీ వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మా అధ్యక్షుడికి లేఖ రాశారు. యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ కూడా శివాజీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శివాజీ సారీ చెప్పాడు.





