
క్రైమ్ మిర్రర్, అమరావతి :-విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కేవలం 99 పైసల నామమాత్రపు ధరకు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.గత ఏడాది అక్టోబర్ లో నారా లోకేష్ టాటా హౌస్‌ను సందర్శించి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక పెద్ద అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించాలని కోరారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. 99 పైసలకే 21.6 ఎకరాల భూమిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఏపీ ప్రభుత్వం కేటాయించింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ వైజాగ్ యూనిట్ లో రూ.1,370 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. దీని ద్వారా 12,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సనంద్‌కు 99 పైసలకు భూమిని కేటాయించడం ద్వారా టాటా మోటార్స్ ను తీసుకువచ్చారు, ఇది గుజరాత్ ఆటో పరిశ్రమకు ఒక మైలురాయిగా గుర్తించబడింది. ఇప్పుడు TCS కు ఈ భూమి కేటాయింపు ఇవ్వడం ద్వారా ఏపీలో కూడా ఐటీ రంగానికి ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.
విశాఖపట్నంలోని రుషికొండ వద్ద ఐటీ హిల్ నెం. 3లో 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు లీజు ధరకు (99 పైసలు) TCS కు కేటాయించారు. ఈ చర్య ద్వారా విశాఖపట్టణాన్ని ఒక ముఖ్యమైన టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, TCS ను ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయమని కోరారు. కాగా ఆయన ప్రయత్నాల ఫలితంగానే ఈ భూమి కేటాయింపు సాధ్యమైంది. TCS విశాఖపట్నంలో 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభంలో అద్దె భవనం నుండి పనిచేయనున్నారు, శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తి కావడానికి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐటీ రంగంలో కనీసం 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ను ఒక ముఖ్యమైన టెక్నాలజీ గమ్యస్థానంగా నిలపడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. ఇతర టెక్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరించడానికి విశాఖపట్నం వైపు చూస్తున్నాయని సమాచారం.