జాతీయం

మణిపూర్ లో మరోసారి ఆందోళనలు, సామూహిక ఆత్మాహుతికి యత్నం!

Manipur protests: మణిపూర్ లో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల అరెస్ట్ అయిన మొయితీ నాయకులను విడుదల చేయాలంటూ.. ఆ వర్గానికి చెందిన యువకులు రోడ్డెక్కారు. రాజధాని ఇంఫాల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించారు. పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఆందోళనకు దిగారు. రహదారుల మీద టైర్లు వేసి తగులబెట్టారు. రోడ్లను తవ్వి భద్రతా బలగాల వాహనాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దుకాణాలపై దాడులకు తెగబడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. పలు చోట్ల భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.

ఆందోళనలు ఎందుకంటే?

తాజాగా అరంబాయ్‌ టెంగోల్‌ నేత కరణ్‌ సింగ్‌ ను సీబీఐ అరెస్టు  చేసింది. అతడిని వెంటనే విడుదల చేయాలని ఆ వర్గానికి చెందిన యువత నిరసనలకు దిగింది. లేని పక్షంలో సామూహికంగా ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించింది. అనంతరం కొందరు యువకులు తమ మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా 5 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తూర్పు ఇంఫాల్‌, పశ్చిమ ఇంఫాల్‌, బిష్ణుపూర్‌, థౌబల్‌, కాక్చింగ్‌ జిల్లాలతో పాటు మరికొద్ది చోట్ల కర్ఫ్యూ విధించింది. సుమారు 5 రోజుల పాటు ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరంబాయ్ ని ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే?

మణిపూర్ లో కరణ్‌ సింగ్‌  హెడ్ కానిస్టేబుల్ గా పని చేసే వాడు. అరంబాయ్ మొయితీ సభ్యులతో కలిసి అడిషనల్ ఎస్పీ అమిత్‌ ఇంటి మీద దాడి చేసి, అతడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత కరణ్‌ సింగ్‌  ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం అరంబాయ్‌ టెంగోల్‌ లో చేరి ఆందోళనలు చేపట్టాడు. కరణ్‌ సింగ్‌ ను తొలుత భద్రతాబలగాలు అరెస్టు చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి అప్పగించడంతో, అతడిని అదుపులోకి తీసుకుంది. వెంటనే కరణ్ సింగ్ ను విడుదల చేయాలంటూ అరంబాయ్ టెంగోల్ యువకులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలపై గవర్నర్ అజయ్ కుమార్ భల్లా సమీక్ష నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక మణిపూర్‌లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

Read Also: జూన్ 14 వరకు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Back to top button